హనుమకొండ, సెప్టెంబర్ 15 : పాదయాత్ర నేపథ్యంలో హనుమకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని తన ఇంటిలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సుబేదారి పోలీసులు సోమవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్రమ హౌస్ అరెస్ట్‌ను ఖండించారు. రాజయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత రాజయ్యను వదలిపెట్టగా స్టేషన్‌ఘన్‌పుర్ నియోజకవర్గంలో పాదయాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా తాటికొండ మాట్లాడుతూ బీఆర్ఎస్ జెండాతో గెలిచిన కడియం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసస్తే లేదని స్పష్టంచేశారు. రైతుల కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్రను కొనసాగిస్తానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పార్టీ మారాడని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కడియం శ్రీహరి.. కేసీఆర్ భయంతోనే జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడని పేర్కొన్నారు.
జనగామ, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఊసరవెల్లి సిగ్గుపడేలా..రంగులు మార్చే కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలం కుర్చపల్లి నుంచి రైతులకు సాగునీరు, యూరియా అందించాలనే డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేపట్టిన ‘రైతు పాదయాత్ర’ను మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.