నర్సంపేట, ఆగస్టు 26 : రైతుల సమస్యలను విస్మరించి కాంగ్రెస్ పార్టీ రాజకీయ యాత్రలు చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రేవంత్ సర్కార్ యూరియా కుంభకోణానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. అధిక ధరకు నానోయూరియా అమ్ముతూ రైతులను దోచుకుంటుందని విమర్శించారు. యూరియా అడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ శ్రేణులు దండయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి రూ.1267 కోట్ల బోనస్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.262 కోట్ల బోనస్ ఎగవేసిన కాంగ్రెస్ సర్కార్.. జిల్లాలో బోగస్ యాత్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ రాజకీయ యాత్రలని ఆరోపించారు. యూరియా కొరతపైన ప్రధానిని ఎందుకు నిలదీయడం లేదని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.