నర్సంపేట(ఖానాపురం), డిసెంబర్ 1: యాసంగి వడ్లకు ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. రైతు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని తెలిపారు. యాసంగిలో రైతులు పండించిన సన్న వడ్లకు నేటికీ బోనస్ చెల్లించకపోవడం దారుణమన్నారు.
రైతులకు బోనస్ పైసలు చెల్లించిన తర్వాతనే నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. గత నెలలో మొంథా తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిని రైతులు పెట్టిన పెట్టుబడి కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం తూతూమంత్రంగా కొన్ని పంటల కొంత విస్తీర్ణాన్ని మాత్రమే చూపించి చేతులు దులుపుకుందని విమర్శించారు. పత్తి పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిందని, ప్రభుత్వం మాత్రం పత్తికి నష్టపరిహారం ఇవ్వమని చెబుతుందని అన్నారు. తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు అన్ని రకాల పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలన్నారు.
కేసీఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ మహిళా సంఘాలకు, పీఏసీఎస్ సెంటర్లకు, ఎఫ్‌పీవోలకు కేటాయించామని, ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ల కోసం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేటాయించారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు విన్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, తక్షణమే బోనస్, పంట నష్టపరిహారం చెల్లించాలని, కొనుగోలు కేంద్రాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని పెద్ది డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ మీనాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు కాస ప్రవీణ్, వల్లెపు సోమయ్య, భూక్యా పద్మ, వెంకన్న, మాజీ జడ్పీటీసీ బాలునాయక్, ముఖ్య నాయకులు గుగులోత్ లక్ష్మణ్‌నాయక్, కోరె సుధాకర్, తక్కళ్లపల్లి బాబురావు, జాటోత్ బాలు, శ్రీనివాస్, అశోక్, రవి, రాము తదితరులున్నారు.