కోస్గి, జూన్ 25: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ‘అనుముల’ రాజ్యాంగం నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కొడంగల్‌లో ఏ కార్యక్రమం చేసినా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అధికారికంగా పాల్గొనడమేమిటని, ఆయనకు కనీసం సర్పంచ్ స్థాయి కూడా లేదని, అలాంటి వ్యక్తికి అధికారులు ప్రొటోకాల్ విస్మరించి సలాం కొడుడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనుకుంటే తిరుపతిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ.. అక్రమ కేసుల పేరుతో పోలీస్స్టేషన్లకు పిలిచి భయబ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా సీఎం సొంత ఇలాకాలో పాలన కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. సీఎంకి ఈ విషయం తెలియకుంటే తెలుసుకొని సరిచేయాలని కోరారు.
‘సారూ పోలీసులు వేధిస్తున్నారు’
‘సారూ మమ్మల్ని పోలీసులు వేధిస్తున్నారు కాపాడండి’ అంటూ ఒడ్డుకింది తండాకు చెందిన కుటుంబం నరేందర్‌రెడ్డికి తమ గోడు వెల్లబోసుకున్నది. కోస్గికి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ తమ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు.
ఏం ఉద్ధరించారని రైతు సంబురాలు? ; బీఆర్ఎస్ నేత విజయ్‌కుమార్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం ఉద్ధరించిందని రైతు సంబురాలు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్‌కుమార్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో.. ఇందిరమ్మ విధించిన ఎమర్జెన్సీ 50 ఏండ్లు పూర్తయినందున ఎమర్జెన్సీ సంబురాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసినందుకు సంబురాలు చేస్తారా?.. రైతు భరోసా 15వేలు ఎగ్గొట్టినందుకు సంబురాలు చేస్తారా? అని నిలదీశారు.