కోస్గి, నవంబర్ 25 : ‘రేవంత్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడ్తున్నారు. గన్నీ బ్యాగుల కోసం గోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు ధర లేక దిగాలు చెందుతున్నారు. అయినా కాంగ్రెస్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది’ అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా చేపట్టగా.. మాజీ ఎమ్మెల్యే పట్నం పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని రైతులతో కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చినా గన్నీ బ్యాగులు అందించలేని దుస్థితిలో సర్కార్ ఉన్నదని మండిపడ్డారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తిందని అన్నారు. పత్తికి మద్దతు ధర చెల్లించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 8 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొంటామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ఎకరాకు 15 క్వింటాళ్లు పండితే 8 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగితాది సీఎం ఇంటి వద్ద పెట్టుకుంటాడా? అని ప్రశ్నించారు.
కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డుపడుతుందని ముఖ్యమంత్రి మాట్లాడటంపై మండిపడ్డారు. పచ్చని పంట పొలాల్లో విషపునీరు పారుతుందంటే అడ్డుకున్నామే తప్ప అభివృద్ధిని కాదని సూచించారు. కోస్గి మండలానికి మంజూరైన ఇంజినీరింగ్ కళాశాలను అక్కడే ఉంచాలని, కొడంగల్‌కు మంజూరైన మెడికల్ కళాశాల అక్కడే ఉంచి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ‘సిమెంట్ ఫ్యాక్టరీలు మాకిచ్చి.. మా ఇళ్లల్లో దుమ్ము పోసి.. మీ బంధువులు భూములు కొన్న దగ్గర మంచి అభివృద్ధి పనులు చేసుకుంటారా?’ అని ప్రశ్నించారు. కొడంగల్ ప్రజల ఓట్లతో గెలిచి ఇక్కడ చేయాల్సిన అభివృద్ధిని తన బంధువులకు అనువుగా ఉన్న మహేశ్వరం ప్రాంతానికి పెద్ద పెద్ద స్టార్టప్ కంపెనీలు తెచ్చి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. అయితే సీఐ అక్కడికి వచ్చి ధర్నా అనుమతి లేదని అభ్యంతరం చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. రైతుల కోసం చేస్తున్న దీక్ష అని.. స్వలాభం కోసం చేస్తున్నది కాదని చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.