ఖలీల్‌వాడి, నవంబర్ 20: రైతు డిక్లరేషన్ అమలు చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని వరంగల్‌లో సభ నిర్వహించారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్‌రెడ్డికి సాధ్యం కాదన్నారు. వైఎస్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని, ప్రజలంతా తిరగబడటం ఖాయమని అన్నారు. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు. బుధవారం నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి వరంగల్ సభలో చేసిన వ్యా ఖ్యలపై తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. ‘వరంగల్‌లో జరిగింది విజయోత్సవ సభ కాదు, కాంగ్రెస్ విషాదసభ, ఆయన మాటలు విని అబద్ధమే సిగ్గుతో తలదించుకుంది’ అని ఎద్దేవా చేశారు. మూసీ నది ప్రక్షాళనకు బదులు రైతులకు రుణమాఫీ చేయాలని, ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరంగల్ సభలో రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అదే వరంగల్‌లో సీఎంగా విజయోత్సవ సభలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు.