పెద్దపల్లి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘దారిన పోయే దానయ్యలు.. ఊశిగాళ్లు గోశిగాళ్లు అచ్చి టికెట్ నాదే అంటే బీజేపీ ఏమన్నా దిక్కు లేనిదా? వచ్చినోళ్లందర్నీ గౌరవిస్తున్నం. మీరచ్చి ఉన్నోడికి ఎసరు పెడుతం అంటే కుదరదు. మేము నోరు విప్పితే బాగుండదు. బీజేపీ ఏంది బంజరు దొడ్డికంటే అధ్వానమైంది’ అంటూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు.
గురువారం ఆయన పెద్దపల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ మధ్య కొందరు బీజేపీలో చేరారని, వారంతా బీజేపీ టికెట్ తనకంటే.. తనకేనని చెప్పుకొంటున్నారని విమర్శించారు.
‘నేను అంత బలహీనంగా కనిపిస్తున్ననా? నేను ఎమ్మెల్యేగా పనిజేసిన నాడు గతంలో ఎవ్వడూ చేయని అభివృద్ధి జేసిన’ అని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పర్యటన తరువాత ఎవరేందో చూసుకుందామని సవాల్ విసిరారు. ఇటీవల పార్టీలో చేరిన సురేశ్‌రెడ్డి ఎన్నడన్నా బీజేపీ కోసం తిరిగిండా? అని ప్రశ్నించారు. కార్యకర్తల చమట చుక్కలను రక్తంగా మార్చామని, ఇక్కడ ఆయారాం.. గయారాంలకు స్థానం లేదన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గుజ్జుల తెలిపారు.