హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది.. పీడిత పాలన.. భ్రష్టు పాలన అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సక్రమంగా అమలుచేయక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ జోస్యాలు మాని, ప్రజలకు మేలు చేయడంపై దృష్టి సారించాలని హితవుపలికారు. తెలంగాణ భవన్లో మంగళవారం పార్టీ నేతలు బొమ్మెర రామ్మూర్తి, రఘురామ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. మూసీ కుంభకోణంలోనే కాంగ్రెస్ మునిగిపోవడం ఖాయమని చెప్పారు.
ప్రజల్లో ఎవరిని కదిలించినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నదని అన్నారు. లగచర్లలో అర్ధరాత్రి వేళ కరెంట్ తీసివేసి పోలీసుల ముసుగులో గిరిజనుల ఇండ్లలో చొరబడి మహిళలపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. లంబాడ మహిళలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, కొట్టారని, యువకులపై కూడా దాడిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నదని, ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.