హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ను అంతం చేయడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాదు కదా.. ఆయన జేజమ్మ తరం కూడా కాదు’ అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఇవన్నీ పక్కనబెట్టి కోమటిరెడ్డి తన కుటుంబంలో అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని చురక అంటించారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. అసలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితపై మాట్లాడే అర్హత కోమటిరెడ్డికి లేదని అన్నారు. హరీశ్, కేటీఆర్ వద్దంటే పోలీస్ అధికారి ప్రభాకర్‌రావు భారత్‌కు రావటం లేదని అంటున్నారని.. వారి తర్వాత రేవంత్ కూడా అమెరికా వెళ్లారని, మరి ప్రభాకర్‌రావుకు సీఎం ఏం చెప్పి వచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉంటూ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని చెప్పిన చరిత్ర వెంకట్‌రెడ్డిది అని దుయ్యబట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రిగా కోమటిరెడ్డి చేసింది శూన్యం అని.. తపాస్‌పల్లి నుంచి నీళ్లు తెస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. రిజర్వాయర్ల నుంచి జిల్లా చెరువులు నింపే అవకాశమున్నా ఆ పని ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ‘గంధమల్ల రిజర్వాయర్ పనులు పూర్తి చేయకుండా ఏం చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని పోచంపల్లి నుంచి రంగారెడ్డి జిల్లాకు రేవంత్‌రెడ్డి తరలిస్తే కోమటిరెడ్డి ఏం చేస్తున్నారు? జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? యాదాద్రికి మంజూరైన మెడికల్ కాలేజీని గతంలో కేటాయించిన ప్రదేశంలోనే ఉంచేలా కోమటిరెడ్డి ఎందుకు ప్రయత్నించటం లేదు? మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య తగ్గిస్తుంటే ఏం చేస్తున్నారు?’ అని ఎండగట్టారు. వేరే విషయాలు తగ్గించి జిల్లా విషయాలను సీఎంతో కోమటిరెడ్డి చర్చిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీకర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.