హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ):15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని మహిళా శక్తి పేరిట పత్రికలకు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత వాటిని మరిచిపోయిందని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని సీఎం చెప్తున్నారని, ఈ విషయం హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? అని నిలదీశారు. తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ మహిళా నేతలు తుల ఉమ, సుశీలారెడ్డి, నందిని బాలారెడ్డి, ఖుషి సమ్ము, లింగాల శోభారాణితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమం కొరవడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏం సాధించిందని పరేడ్ గ్రౌండ్స్‌లో సభ పెట్టిందని ప్రశ్నించారు. మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు రేవంత్ పాలనలో నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకాన్ని గొప్పగా చెప్తున్నారని, కానీ బస్సుల సంఖ్య తగ్గించారని ధ్వజమెత్తారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ 20-25 శాతం మందికి కూడా అందడం లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి పేరిట మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏమైందని నిలదీశారు.
హక్కుగా సాధించుకోవాలి: తుల ఉమ
పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే అడుక్కోవడం కాదు.. హక్కుగా సాధించుకోవాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పిలుపునిచ్చారు. అవనిలో సగం, ఆకాశంలో సగం ఉన్న మహిళలకు అవకాశాలు తకువ వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించాలని, చట్టసభల్లో సగం సీట్లు కేటాయించాలని కోరారు.