హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో శాసన మండలి రద్దు అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్‌కు అప్రతిష్ట తెస్తాయని తెలిపారు. కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, వారందరిపై అనర్హత వేటు పడటం ఖాయమని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో శాసన మండలి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసనమండలి ఏర్పాటు చేయడం కుదరదని గుర్తు చేశారు. ప్రస్తు తం 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయమై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని, కోర్టులో కూడా పిటిషన్ వేస్తానని చెప్పారు.