జయశంకర్ భూపాలపల్లి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ నిర్వీర్యానికి సీఎం రేవంత్ కుట్ర పన్నుతున్నాడని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఫలితంగా సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1 ఇైంక్లెన్లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. గనిపై కార్మికులను కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ సింగరేణిలో గెలిచిన సంఘాలు అచేతనావస్థకు చేరాయని విమర్శించారు. ఈ నెల 12న భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సింగరేణి పరిరక్షణ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. ఈ సదస్సుకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతున్నారని తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.