హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు కాలిగోటికి కూడా సరిపోనివాళ్లు ఆయనకు సవాళ్లు విసరడం సిగ్గుచేటని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ విమర్శించారు. ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో జరిగిన విషయాలపై స్పందించిన హరీశ్‌రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని హితవుపలికారు. హరీశ్‌రావుపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేనిపక్షంలో తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా స్పందించని అడ్లూరి సవాళ్లు విసరడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రభుత్వంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు నిజం కాదా? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు. దకన్ సిమెంట్ పరిశ్రమ నుంచి కమీషన్ల కోసమే గొడవంతా జరిగిందని పేర్కొన్నారు. రోహిన్‌రెడ్డి, కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఇద్దరూ కలిసి తుపాకీ పెట్టి వ్యాపారవేత్తను బెదిరించారని ఆరోపించారు. చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే 100 ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌రెడ్డి రూల్స్‌పై కాంగ్రెస్ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని గాదరి కిశోర్ నిలదీశారు.