హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : వరంగల్ పర్యటనలో స ర్కారుపై కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమబిడ్డలైన కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి దుర్భాషలాడడం దురదృష్టకరమని ఆక్షేపించారు. గురువారం తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ కేటీఆర్ మోకాలెత్తు లేని రాజేందర్‌రెడ్డి ఎగిరెగిరి పడుతున్నాడని మండిపడ్డారు. సోయితప్పి, స్థాయిమరచి విమర్శలు చేస్తూ రాజకీయ బ్రోకర్.. సర్కస్‌లో జోకర్‌గా మారాడని ఘాటు వ్యాఖ్యలు చేశా రు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాజేందర్‌ది నీచ చరిత్ర అని, అడ్డిమార్ గుడ్డిలో గెలిచి అభివృద్ధిని మరిచాడని మండిపడ్డారు. రెండేండ్లుగా ఆయన వెకిలిచేష్టలు భరించామని ఇక ఊరుకోమని హెచ్చరించారు. నాయిని దుర్మార్గపు వ్యవహారాలు దశలవారీగా బయటపెడతామని, కేటీఆర్‌ను ఉద్దేశించి తప్పుగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు.
కేటీఆర్‌పై విరుచుకుపడుతున్న రాజేందర్‌రెడ్డి హామీలు అమలు చేయని ముఖ్యమంత్రిని ఎన్ని కోట్ల చెప్పులతో కొట్టా లో చెప్పాలని ప్రశ్నించారు. ప్రశాంతం గా ఉన్న తెలంగాణలో అలజడి రేపేందుకే నాయిని రాజేందర్‌రెడ్డి కేటీఆర్‌పై సోయితప్పి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ప్రజలు బట్టలూడదీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. దివ్యాంగు ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నాయిని ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, పిచ్చి మాటలు బంద్ చేయాలని సూచించారు. చేసిన పనులు చెప్పుకోలేకే కేటీఆర్‌పై దూషణలకు దిగుతున్నారని, ఇప్పటికైనా చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో పరాభావం తప్పదని హెచ్చరించారు.