 
                                                            చిట్యాల, అక్టోబర్ 23: కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించడమే కాదు.. దిగుబడులను అమ్ముకుందామన్నా కష్టంగానే ఉన్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. పత్తి సీజన్ వచ్చినా రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో పత్తి చేన్లను సందర్శించి, రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పత్తిని నిల్వ చేసుకోలేక రైతులు సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పంటను దళారుల చేతుల్లోకి నెట్టేందుకు ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం దళారులనే ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు లాభం కలిగే విధంగా పంటలకు మద్దతు ధర ఇచ్చి సమయానుకూలంగా కొనుగోలుకు చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెడుతున్నదని వాపోయారు. సీసీఐ ఆధ్వర్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
 
                            