హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎంపీహెచ్ఏ(ఫిమేల్) ఉద్యోగోన్నతులకు 2023లో పరీక్షలు నిర్వహిస్తే 2026 వచ్చినా ఫలితాలు విడుదల చేయకపోవడం ఏంటీ.? అని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సోమవారం కోఠి హెల్త్ క్యాంపస్‌లో తమ సమస్యలు పరిష్కరించాలని రెండో ఏఎన్ఎంలు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రయాసలు పడి పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఫలితాలు విడుదల చేయకపోవడం ఏంటీ? అని మండిపడ్డారు.
ఏఎన్ఎంల డిమాండ్లు అయిన 100% గ్రాస్ సాలరీ, రూ.10 లక్షల హెల్త్, రూ.10లక్షల లైఫ్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ మాట్లాడుతూ.. ఫలితాలు విడుదల చేయాలని అధికారులకు 22 సార్లు వినతిపత్రాలు ఇచ్చిన స్పందన లేదని వాపోయారు. ధర్నా అనంతరం ఎంపీహెచ్ఏ(ఎఫ్) ప్రొవిజనల్ లిస్టును విడుదల చేయాలని ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు సెక్రటరీ గోపీకాంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పది రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేస్తామని సెక్రటరీ మెయిల్ ద్వారా తెలిపినట్టు ఏఐటీయూసీ ప్రతినిధులు పేర్కొన్నారు.