నడిగూడెం, సెప్టెంబర్ 18: కమీషన్ల కోసం కక్కుర్తి పడి టెండర్ల పేరుతో కాలయాపన చేస్తూ సాగర్ ఎడమక్వాలకు పడిన గండిని పూడ్చడంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఎండిపోయిన వరి పైర్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాగితపు రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు గండి పడి సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గండి పూడ్చకపోవడంతో సాగునీరు లేక 50వేల ఎకరాల్లో వరి ఎండిపోతున్నదని తెలిపారు. ఎండిపోతున్న పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం ; నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ, సెప్టెంబర్ 18: బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఆఫీస్‌ను కూల్చాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. దీనిపై వెంటనే అప్పీల్‌కు వెళ్తామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామే తప్ప కూల్చుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఆఫీసుకూ అనుమతి లేదన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడాలు గాక నిలబెట్టడం నేర్చుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో హితవుపలికారు.