సీసీసీ నస్పూర్, జనవరి 22: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. బాల్క సుమన్ ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. పార్టీ గుర్తులేకుండా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41శాతానికి పైగా పంచాయతీలను పార్టీ కైవసం చేసుకున్నదని గుర్తుచేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ హయాంలోని సంక్షేమాభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్ బాకీ కార్డులు ఇంటింటికీ అందజేస్తూ కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో చేసిన మోసాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిస్తే జిల్లాలు రద్దు చేయడం ఖాయమనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సింగరేణి గనుల టెండర్లలో అవినీతి బాగోతం బీఆర్ఎస్ బయటపెడితే.. డైవర్షన్ రాజకీయాలతో హరీశ్‌రావును పోలీస్ విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నంచేశారని పేర్కొన్నారు.