వికారాబాద్ : ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy) అరెస్ట్‌ని ఖండిస్తున్నామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్(Former MLA Anand) అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కష్టాలను విస్మరిస్తూ, అభిప్రా యాలని తుంగలో తొక్కుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షణా నిలబడితే నిర్భందిస్తారా? అని ప్రశ్నించారు. అమాయక రైతుల పట్ల అప్రజాస్వామికంగా తీవ్ర నిర్బంధం ప్రయోగించటం దుర్మార్గమని పేర్కొన్నారు.
అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని, అమాయక రైతులని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కాగా, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.