బంజారాహిల్స్, నవంబర్ 4 : మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవీ ప్రసాద్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవో మాజీ చైర్మన్ మామిళ్ల రాజేందర్ తదితరులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తూ ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ రూపొందించిన కరపత్రాన్ని మంగళవారం వారు విశ్రాంత ఉద్యోగుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పీఆర్సీలో 43% వేతన పెంపు చేపట్టడంతోపాటు కొవిడ్ సంక్షోభ సమయంలో 30% ఫిట్మెంట్తో మొత్తం 78%పెంపు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
బోగస్ హామీలతో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన 18,672 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్ చెల్లించలేదని, దీంతో అనేకమంది విశ్రాంత ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దేశచరిత్రలో ఇదే తొలిసారి అని విమర్శించారు. ఉద్యోగులకు దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులతోపాటు సమాజంలోని అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాల్సిందేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు సుమిత్రానంద్, విష్ణువర్ధన్‌రావు, మహ్మద్ సూరజ్, మహ్మద్ ఖుత్బుద్దీన్, జహీరుద్దీన్, మోకిద్ పాల్గొన్నారు.