ఖలీల్‌వాడి, అక్టోబర్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలు పెట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని, ఎన్నికలు వస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల స్పందించారు. గురువారం నిజామాబాద్‌లో ఈఆర్సీ చేపట్టిన బహిరంగ విచారణకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌తో కలిసి హాజరైన ఆయన వేముల మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మీ పార్టీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డియే డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలి. ఈ విషయంలో స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి త్వరగా నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక పాలనపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసులతో కలిసి అరాచక పాలన సాగిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ‘ముఖ్యమంత్రికి దమ్ముంటే జీవన్‌రెడ్డి చేసిన డిమాండ్ మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలు పెట్టాలి. ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీరు అనుసురిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక చర్యల మీద ప్రజలే తీర్పు చెబుతారు’ అని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవమంటూ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ఫొటోలకు పోజులిచ్చారని, కానీ ఇప్పటిదాకా ఒక్క గింజ కూడా కొనలేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదని, ఇప్పటికీ రైస్‌మిల్లులు కేటాయించలేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దిక్కులేక దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ కలిపి రైతుకు క్వింటాకు రూ.2,800 రావాల్సి ఉండగా, కొనుగోలు కేంద్రాలు లేక దళారులకు అగ్గువకు అమ్మి నష్టపోతున్నారని తెలిపారు. గత పదేండ్లలో కేసీఆర్ ఉన్నంత కాలం రైతులు దళారులకు అమ్ముకోలేదని, కాంగ్రెస్ చేతగానితనం వల్ల ఇప్పుడు అమ్ముకోవాల్సి వస్తుందని విమర్శించారు. సన్న రకాలతోపాటు దొడ్డు రకాలకూ బోనస్ ఇవ్వాలని వేముల డిమాండ్ చేశారు.