హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం ఆలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు జరగపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయకుంటే సీబీఐ విచారణ కోరాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్టు కాంగ్రెస్ నేతల తీరు ఉన్నదని ఎద్దేవాచేశారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పు వెనుక అరాచకాలు బయటపెట్టగానే కాంగ్రెస్ నాయకుల పరిస్థితి తేలుకుట్టిన దొంగలా అయిందని శనివారం ఆయన ఓ ప్రకటనలో ఎద్దేవాచేశారు.
స్రిప్ట్ ప్రకారం ప్రెస్‌మీట్ పెట్టి తనను విమర్శించిన కాంగ్రెస్ నేతలకు ట్రిపుల్ఆర్ మీద కనీస అవగాహన లేదంటూ విమర్శించారు. ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు ? కేంద్రం ఎప్పుడు ఒప్పుకున్నది? తెలియని వారి విమర్శలకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తమ హయాంలో ట్రిపుల్ ఆర్‌పై పదేండ్లలో ఏ పనీ జరగలేదనడం కాంగ్రెస్ నేతల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉత్తర భాగం అనుమతులు 2021లో కేసీఆర్ హయంలోనే వచ్చాయని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను భారత్‌మాల ఫేజ్-1లో చేర్చుతూ 2021 మార్చి 5న ఎన్హెచ్ఏఐ అనుమతి ఇచ్చిందని, 2021 డిసెంబర్ 6న అలైన్మెంట్ ఆమో దం లభించిందని గుర్తుచేశారు.
సంవత్సరం 10 నెలల్లోనే భూ సేకరణ మొదలుపెట్టి 76 శాతం 3డీ పూర్తి చేశామని, పేదలకు ఎకడా ఇబ్బంది లేకుండా భూ సేకరణ చేశామని తెలిపారు. ‘కాంగ్రెస్‌నేతలు, వారి బంధువుల భూములు ఉన్నచోట ఆలైన్మెంట్ మారుస్తున్నారా? లేదా? అమాయక పేదలను బెదిరిస్తూ కబ్జా ఒప్పంద రద్దు పత్రాలు రాసుకుంటున్నారా లేదా?’ అని ప్రశ్నించారు. కుందారం భూములను పేదల నుంచి లాక్కుంటున్న భూ భకాసురుల పక్షాన నిలబడి, కండ్లుండీ చూడలేక ఈ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నదని విమర్శించారు. అలైన్మెట్ మార్పులో కాంగ్రెస్ నేతల బాగోతాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టంచేశారు.