హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాలు బయటపెట్టగానే కాంగ్రెస్ నాయకులు ఉలికిపాటుకు గురవుతున్నారని మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రజలు తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, వాటి పరిష్కారానికి ఒత్తిడి తేవడమే ప్రతిపక్షం బాధ్యత అని తెలిపారు.
ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యల కోసం కొట్లాడతామని స్పష్టంచేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ప్రతిపక్ష పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతిపక్షం చెప్తున్న విషయాలు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
మంత్రులు వెళ్లి వాస్తవాలు ఏమిటో చూసి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎండిన పొలాలు ఎకడున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రశ్నించడమే పాపమన్నట్టు వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలని సవాల్ విసిరారు. వంద సీట్లు కూడా రావని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి, ఇక ఎప్పటికీ రాదు అంటామా? అని ప్రశ్నించారు. రెండు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఇప్పుడు అధికారంలో లేదా? అని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం బీఆర్ఎస్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే నీళ్లు రావడం లేదు
నీళ్ల పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా, ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వం కనీసం సమీక్ష నిర్వహించలేదని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కరివెన, వట్టెం, ఏదుల రిజర్వాయర్లు ఏమేరకు పూర్తయ్యాయో సమీక్షించాలని కోరారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో కరువు జాడేలేకుండా పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ కొట్లాడిన, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
గత అసెంబ్లీ చేసిన తీర్మానాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని సూచించారు. నిందలు వేయడంమాని రైతుల కష్టాలపై దృష్టిసారించాలని కోరారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి హామీలు అమలయ్యాయో, లేదో తెలుసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే నీళ్లు రావడం లేదని ఆరోపించారు.
తెలంగాణను ఆగం చేయవద్దని, ఏపీలో కలిసిన ఏడు మండలాలను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించాలని ప్రభుత్వానికి సూచించారు. కేఆర్ఎంబీపై ఉమ్మడిగా కొట్లాడేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చరిత్ర తెలుసుకొని, చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీ పోతుందా? అని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు.