హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి నిరాశపర్చారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. గౌడ కులస్థులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి గురించి మాట్లాడుతారనుకుంటే.. స్పందించనేలేదని అన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ ఇచ్చిన కాటమయ్య మోకులు కేసీఆర్ హయంలో తయారైనవేనని, ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోయామని తెలిపారు. వైన్, బార్‌షాపుల్లో గౌడలకు కేసీఆర్ హయంలో 15 శాతం రిజర్వేషన్లు ఇస్తే, తాము 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని.. అలాంటిది షాపుల రిజర్వేషన్ల గురించి సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత కార్మికుల పెన్షన్ రూ.4 వేలకు పెంచాలని, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
గౌడలకు మోపెడ్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సర్వాయి పాపన్న జయంతి వచ్చే నెలలోనే ఉన్నదని, అప్పటికి విగ్రహం ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామన్నారని, ఇప్పటి వరకు ఆ ఊసే లేదని దుయ్యబట్టారు. సర్వాయి పాపన్న తిరిగిన 4 వేల ఎకరాల గుట్టలను పరిరక్షించేందుకు పురావస్తు శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలు జరుపుకుంటున్న నీరా కేఫ్‌ల మిగతా పనులు పూర్తి చేసి ప్రారంభించాలని, కల్లు దుకాణాలకు శాశ్వత లైసెన్సులు ఇస్తామన్న హామీ నెరవేర్చాలని అన్నారు. హామీల అమలుపై స్పందించకుంటే గౌడ సంఘాలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, కల్లు గీత ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నేత ఇస్లావత్ రామచంద్రునాయక్ పాల్గొన్నారు.