హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కల్తీ పేరిట ఔషధ గుణాలు కలిగిన కల్లును నిషేధించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. లిక్కర్ మాఫియాకు తలొగ్గి గీత వృత్తిపై కక్ష కడుతున్నదని ధ్వజమెత్తారు. గీత సొసైటీలకు ఐదు ఎకరాల స్థలం ఇస్తామని, ప్రమాద ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచుతామని, మద్యం దుకాణాల కేటాయింపులో 25 శాతం కోటా వర్తింపజేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏడాదిన్నర దాటినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో సోమవారం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గట్టు రాంచందర్‌రావు, కిశోర్‌గౌడ్, నాగేందర్గౌడ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
పలు కల్లు కాంపౌండ్లలో జరిగిన కల్తీ ఘటనలను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం లక్షల మంది ఆధారపడ్డ కులవృత్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కల్లు కాంపౌండ్ల మీద పది కులాలు బతుకున్నాయనే స్పృహ లేకుండా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. లిక్కర్ కంపెనీల కమీషన్ల కక్కుర్తికి ఆశపడి వృత్తిని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. నీరాను ప్రోత్సాహిస్తామని ఓట్ల కోసం గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజా యి నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం ఆరోగ్యప్రదమైన కల్లుపై కత్తిగడుతున్నదని విమర్శించారు.
సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కల్తీ కల్లు నిరోధానికి చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇందుకు బీఆర్ఎస్ సైతం సహకరిస్తుందని స్పష్టంచేశారు. అంతేగానీ గీత కార్మికుల కులవృత్తిని ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఇతర కులవృత్తిదారులను సమీకరించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 35 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కల్లు మండువాల నుంచి ప్రతినెలా రూ. 15 లక్షల చొప్పున ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. డిస్ట్టిలరీలిచ్చే కమీషన్లకు ఆశపడి ప్రభుత్వ పెద్దలు సైతం ఇతర రాష్ర్టాల్లో నిషేధించిన బీర్లను తెలంగాణలో అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో భువనగిరిలో ఏర్పాటుచేసిన నీరా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసేందుకు కుటిల యత్నానికి దిగుతున్నదని ధ్వజమెత్తారు. అందాల తారలకు రుచి చూపించి నీరా గురించి గొప్పలు చెప్పుకున్న సర్కారు ఇప్పుడు నీరా కేఫ్‌ల ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో కల్లు దుకాణాలను బంద్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని శ్రీనివాస్‌గౌడ్ తేల్చిచెప్పారు. లక్షల మంది ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడుతామని హెచ్చరించారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ముడుపులు తీసుకుంటున్న ఎమ్మెల్యేల గుట్టు రట్టు చేస్తామని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల తాటి, ఈత చెట్లు లేవని అబద్ధాలు చెప్పడం విడ్డూరమని అన్నారు. సర్కారుకు వృత్తిదారులపై ప్రేమ ఉంటే తాటి, ఈత చెట్లను నరికిన వారిపై కేసులు పెట్టాలని, విధ్వంసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే లిక్కర్ మాఫియా, కల్లు కాంపౌండ్ల నుంచి కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలపై విచారణ జరిపి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. గౌడన్నలకు మద్యం దుకాణాల కేటాయింపులో మరింత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం కల్తీ కల్లును అరికట్టకుండా కల్లు మండువాల జోలికి వస్తే సహించబోమని పల్లె రవికుమార్‌గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులను దొంగల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. నీరా కేఫ్‌లను విస్తరించకుండా వృత్తిదారుల పొట్టగొడుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కల్తీ కల్లు దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ దశాబ్దాలుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నదని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2013లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు అవకాశం ఇవ్వాలని, భవిష్యత్‌లో కోర్టు ఆదేశాలను నిక్కచ్చిగా పాటిస్తామని ఆ పార్టీ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌తోనే అడుగడుగునా అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. అనివార్యంగా బీసీ కోటాను కుదించాల్సి వస్తున్నదని చెప్పారు. న్యాయపరమైన చిక్కుముడులు ఎదురవుతాయని తెలిసినా రేవంత్‌రెడ్డి 42 శాతం కోటా ఇస్తామని పచ్చి అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. అమలుపై చిత్తశుద్ధిలేకనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని ఆరోపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ పేరిట కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట తప్పిన, 42 శాతం కోటా ఇవ్వకుండా దగా చేసిన సీఎం.. బీసీలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.