కవాడిగూడ, ఆగస్టు 25: రాష్ట్రంలో కులవృత్తులపై రేవంత్‌రెడ్డి సర్కార్ దాడి చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. గౌడ వ్యతిరేక జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్-93ను రద్దు చేయాలని, మూతపడ్డ కల్లు దుకాణాలను తెరిపించాలని, కల్లు గీత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్, కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీవో-93 కాపీలను చించివేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కుల వృత్తులను ధ్వంసం చేస్తున్నదని, దీనిలో భాగంగానే కల్తీకల్లు పేరుతో దుకాణాలపై దాడులు చేస్తున్నదని ఆరోపించారు. కల్లుగీత సొసైటీ సభ్యులకు 25% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. గత రెండేండ్లలో చనిపోయిన 1,147 మంది గీత కార్మికులకు రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలను విస్తరించాలని, గౌడ కులస్తులకు తక్షణమే శాశ్వత లైసెన్స్‌లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే వరకూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో గౌడ కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవికుమార్‌గౌడ్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.