ఖైరతాబాద్, ఆగస్టు 23: గౌడ సామాజిక వర్గానికి వైన్‌షాపుల్లో 25% రిజర్వేషన్లు, కల్లుగీత కార్మికుల ఇతర డిమాండ్ల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 25న ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ఉద్యమానికి శ్రీకారం చుడతామని, లాఠీచార్జి, ఫైరింగ్ చేసినా ఎదుర్కొంటానని, నిరాహార దీక్షకు తానే ముందుంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గౌడన్నలకు, కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో అనేకమంది వృత్తిదారులు ప్రమాదవశాత్తు మరణించారని, రూ.12 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సి ఉన్నా, రూపాయి కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. కొత్త మద్యంషాపులకు ఈ నెల 14న జీవో విడుదల చేసిన ప్రభుత్వం 20వ తేదీ వరకు గోప్యంగా ఉంచిందని, అందులోనూ గత ప్రభుత్వం కేటాయించిన 15% రిజర్వేషన్‌పై స్పష్టత లేదని మండిపడ్డారు. గౌడన్నల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని అణచివేసేందుకు, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కల్లులో వాళ్లే మందు, విషం కలిపి ఆ నేరాన్ని గౌడ వృత్తిదారులపై వేస్తున్నారని ఆరోపించారు. పాలల్లో కల్తీ జరిగితే పట్టించుకోవడం లేదని, కానీ 2% మంది తాగే కల్లుపై దృష్టి పెడుతున్నారని, కల్లు దుకాణాలను బలవంతంగా మూసివేస్తున్నారని విమర్శించారు. లిక్కర్ మాఫియాలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రలు ఇకముందు సాగవని, ఇటుక వేస్తే రాయితో జవాబు చెప్తామని హెచ్చరించారు.
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరుసటి రోజే కల్లుగీత కార్మికులకు పక్కా భవనాలు, ప్రభుత్వ స్థలాలతోపాటు శాశ్వత లైసెన్స్‌లు ఇస్తామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీల విస్మరణపై ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఈ నెల 25న ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం, 30న నందనం, ఖిలాపూర్కు వందకార్లతో ర్యాలీ, ఆ తర్వాత ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గౌడ సంఘాల సభలు, ఇందిరాపార్క్ వద్ద గౌడ మహాధర్నా, అనంతరం ఐదు లక్షల మందితో పరేడ్‌గ్రౌండ్‌లో గౌడ ఆత్మగౌరవ సభ నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సమావేశంలో గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, అఖిల భారత గౌడ సంఘం అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్యగౌడ్, అనంతరాజుగౌడ్, దామోదర్‌గౌడ్, చీకటి ప్రభాకర్‌గౌడ్, దుర్గయ్యగౌడ్, బైరు శేఖర్‌గౌడ్, తాళ్ల శ్రీశైలంగౌడ్, గోడ వెంకటేశ్‌గౌడ్, బబ్బూరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.