హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, దేశంలో శత్రువులుగా ఉంటూనే తెలంగాణలో మిత్రబంధాన్ని కలిగిఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ గురించి బీజేపీ దీక్షలు చేయడం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను పకదారి పట్టించేందుకేనని ఆరోపించారు. కాంగ్రెస్ హామీల అమలుకు బీజేపీ ఎందుకు దీక్షలు చేయడం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకొని రైతులు తల్లడిల్లుతుంటే వారి ఆర్తనాదాలు బీజేపీకి వినబడడం లేదా అని, ఆరు గ్యారెంటీలు, 13 అంశాలపై కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై నిలదీసేందుకు బీజేపీ నేతలకు గొంతుపెగలడం లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గిల్లితే బీజేపీకి, బీజేపీని గిల్లితే కాంగ్రెస్‌కు నొప్పిలేస్తుందని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ఈ రెండు పార్టీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
విపక్షాల ఫోన్ల మీద కేంద్రం పెగాసెస్ స్పైవేర్‌ను వాడిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదో, ఎందుకు విచారణకు డిమాండ్ చేయలేదో ఆ రెండు పార్టీలు చెప్పాలని, రాష్ట్రంలో రైతుల జీవితాలు అతలాకుతలమవుతుంటే వారి సమస్యలపై దీక్ష చేసేందుకు బీజేపీ ఎందుకు ముందుకురావడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై నిరాధార, నిందారోపణలతో కాంగ్రెస్ కాలం వెల్లదీస్తూ ప్రజలను మభ్యపెడుతుంటే దానికి బీజేపీ అండగా నిలుస్తున్నదని విమర్శించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసం, తాగునీళ్లు లేక రోడ్డెకుతున్న ఆడబిడ్డల కోసం, రుణమాఫీ అమలు కోసం, ఎకరాకు రూ.15వేల రైతుభరోసా కోసం, కౌలు రైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేల కోసం, ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2500, బాలికలకు ఎలక్ట్రిక్ సూటర్లు, ల్యాప్‌టాప్‌ల గురించి, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ గురించి దీక్షలు చేయాలని సూచించారు.