వనపర్తి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావంతో కరువు రాలేదని.. ఎల్లో కాంగ్రెస్ వల్లే రైతులు కష్టాల పాలవుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన వనపర్తి జిల్లా ఆత్మకూరులో మీడియాతో మాట్లాడారు. పశ్చిమ కనుమల్లో వర్షాలు పడి..ఆ నీళ్లు కృష్ణా, తుంగభద్ర, భీమా నదుల్లో కలుస్తాయని వెల్లడించారు. జూరాలతో సంబంధం లేకుండా తుంగభద్ర ద్వారా శ్రీశైలానికి 400 టీఎంసీల నీళ్లు వస్తాయని, ఇవన్నీ కలుపుకొంటే సాగుకు సరిపడా అందుతాయని స్పష్టంచేశారు. ఆల్మట్టిలో 123 టీఎంసీలు, నారాయణపూర్‌లో 30 టీఎంసీలు, కర్టాటకలో 17లక్షల 30 వేల ఎకరాలకు సరిపోను నీళ్లున్నాయని వెల్లడించారు. పాలమూరులో కృష్ణానదిపై ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు కలిపినా రోజుకు ఒక టీఎంసీ కంటే ఎక్కువ వాడుకోలేమని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. 10 శాతం పనులను రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్ పడావు పెట్టారని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లా కంటే ఆంధ్రా రైతులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ రైతులపై కక్ష కట్టిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. వరద ప్రారంభమైన 3 రోజులకు కొన్ని పంపులను మాత్రమే ప్రారంభించారని, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌లో ఒకే పంప్ ఆన్ చేశారని, గతేడాది 42 రోజుల తర్వాత పంపులు ఆన్ చేశారని గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తే 70టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఎంగా రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకు ఒరగబెట్టింది ఏమీలేదని దుయ్యబట్టారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రైతులు ఊరుకోరు : మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రైతులు చూస్తూ ఊరుకోరని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. గత యాసంగిలో క్రాప్ హాలీడే, ఈ వానకాలంలో ఎల్ నినో పేరుతో వరద నీళ్లను పక్క రాష్ర్టానికి ధారాదత్తం చేసి ఇక్కడ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు ఎండబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మండిపడ్డారు. జూరాలపై ఉన్న సాగునీటి వనరుల ద్వారా ఉమ్మడి జిల్లాలోని భూములకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.