వనపర్తి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాలను నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంగా నిలుస్తుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. పదేండ్ల తర్వాత 64 సీట్లు గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. అరాచకాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చినా హత్యలు, భౌతికదాడులు, అరాచకాలు లేవని, వ్యక్తిగత శత్రుత్వాలకు తావులేకుండా కేసీఆర్ పాలన కొనసాగిందని గుర్తుచేశారు.