మహబూబాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్ఫోన్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని నిరూపించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించిన మంత్రి సీతక బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఆమె మాట్లాడారు. సెల్ఫోన్ల కొనుగోలులో జరిగిన అవకతవకలకు సమాధానం చెప్పని సీతక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సీతక నోరు ఆదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పంపిణీ చేసిన 5జీ సెల్ఫోన్లు తెలంగాణలో ఇచ్చినట్టు ఫొటోలతో ప్రచారం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. రూ. 6 వేల ధర ఉన్న సెల్‌ఫోన్‌ను రూ.14 వేలకు కొనుగోలు చేసినట్టు చూపడం అవినీతికాదా అని ప్రశ్నించారు. అవినీతిపై ప్రశ్నిస్తే చెప్పుతో కొడుతా అని మాట్లాడడం ఎంతవరకు సబబని, మంత్రిగా, మహిళగా ఉండి మాట్లాడే మాటలు ఇవేనా సీతకా .. అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలకు 38 వేల 4జీ సెల్ఫోన్లు ఇచ్చి, 5జీ ఫోను పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇప్పటికైనా కేసీఆర్‌కు మంత్రి సీతక బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.