కందుకూరు, నవంబర్ 12: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుల దగ్గర తీసుకుంటున్న భూమికి బదులుగా భూమి ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.ఫ్యూచర్ సిటీ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులు మండల పరిధిలోని అగర్మియగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఫ్యూచర్ సిటీకి 300ఫీట్ల రోడ్డు అవసరమా ? అని సీఎం రేవంత్‌రెడ్డి పునారాలోచించాలని కోరారు. అటు పక్క నాగార్జునసాగర్, ఇటు పక్క శ్రీశైలం జాతీయ రహదారులు మధ్యలో తిమ్మాపూర్ రోడ్డు ఉండగా.. ఈ రోడ్డు ఎందుకని ప్రశ్నించారు. ఎకరాకు రూ.4 కోట్లకు పైగా ధర పలుకుతుంటే రూ. 19 లక్షలు నష్టపరిహారం ఇస్తామంటే న్యాయమా? అని తెలిపారు. చట్టంలో మార్పు తీసుకువచ్చి మార్కెట్‌రేటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే మాజీ సీఎం కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిన 15 వేల ఎకరాల నుంచి భూమికి భూమి ఇవ్వాలని కోరారు. రైతులకు న్యాయం జరగకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సొంత నియోజకవర్గంలో రైతులకు న్యాయం చేయలేని సీఎం రేవంత్ రాష్ట్ర రైతులకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడిని బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేయడం తగదని తెలిపారు. మాజీ సర్పంచ్ ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మాజీ మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
భూములు ఇవ్వం
ఫ్యూచర్ సిటీకి రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం మా భూములను గుంజుకోవాలని చూస్తు న్నది. ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇవ్వం. నాకున్న 3ఎకరాల్లో 2ఎకరాలు రోడ్డుకు తీసుకుంటున్నారు. ఎకరంలో వ్యవసాయం చేస్తే పూట గడవదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలి.
– ద్యాసాని సుధాకర్‌రెడ్డి,అగర్మియాగూడ
రైతుల ఉసురుతగుల్తది
సీఎం రేవంత్‌రెడ్డి పేదల పొట్టకొట్టాలని చూస్తుండ్రు. తాటాకు చప్పుల్లకు భయపడేది లేదు. రుణమాఫీ చేయలేదు.. రైతు బంధు ఇవ్వలేదు..నీవు రైతు బిడ్డవు. రేవంత్‌రెడ్డికి రైతులే బుద్ధి చెబుతారు. వారి ఉసురు తగలుతుంది.
– నారాయణ, అగర్మియాగూడ