సూర్యాపేట, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1952 సెప్టెంబర్ 14న జన్మించిన దామోదర్‌రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాలను పుణికిపుచ్చుకున్నారు.
1969-73 వరకు వరంగల్ యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేయగా 1979-84 రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ట్రెజరర్‌గా పనిచేశారు. 1985లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం 1989-94 వరకు ఎమ్మెల్యేగా పనిచేయగా 1994-99 కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా గెలిచారు. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం, మరో పక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
తిరిగి 2004-09 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి తుంగతుర్తి శాసనసభ్యులుగా గెలిచారు. రిజర్వేషన్లు మారి తుంగతుర్తి ఎస్సీకి కేటాయించడంతో 2009-14 వరకు సూర్యాపేట శాసనసభ్యులుగా పనిచేశారు. దామోదర్‌రెడ్డి 1992-93, 2008-09 రెండు సార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. దామోదర్‌రెడ్డి సతీమణి వరూధినీదేవి గతంలోనే మృతి చెందారు. ఆయన కుమారుడు సర్వోత్తంరెడ్డి ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
దా మోదర్‌రెడ్డి మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా దామోదర్‌రెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్హౌజ్కు తరలించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 4వ తేదీన తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.