నిర్మల్/ హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి (92) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో 1931 సెప్టెంబర్ 22న జన్మించిన నర్సారెడ్డి.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.
నిర్మల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహీల్స్‌లోని నివాసంలో అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. నర్సారెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు ఆర్పించారు. నర్సారెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క నర్సారెడ్డి భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. మధ్యాహ్నం నర్సారెడ్డి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కోదండరెడ్డి, జీ నిరంజన్, నాగయ్య, కుమార్‌రావు, సాయికుమార్ తదితరులు నివాళులు ఆర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నర్సారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పీ నర్సారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజాసేవలో కొనసాగిన అజాత శత్రువు లాంటి నర్సారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని అడిగారు.