హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశమంతా తిరుగుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తాను అనుకున్నదే చట్టం, చేసేదే న్యాయం అనేలా హస్తం పార్టీ పరిపాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల అర్రాజు పాట ముగిసిందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు ఐఏఎస్ అధికారులు సైతం తీవ్ర వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. ఈ దశలో రాష్ట్రంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వచ్చే తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులా ఉండాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల అర్రాజు పాట ముగిసిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలను ప్రజలు నమ్మారని, మళ్లీ నమ్మేస్థితిలో లేరని స్పష్టం చేశారు. రూ.1,154 కోట్ల మేరకు గత యాసంగి వరి ధాన్యం బోనస్ బకాయిలను సర్కారు రైతులకు చెల్లించడమే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనతో వేధింపులు భరించలేకే రిజ్వి లాంటి ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారని దుయ్యబట్టారు. సిద్దిపేట ఆలయంలో ప్రమాణం చేయడానికి ఒక మంత్రి వెళ్లారని, కానీ వెళ్లాల్సింది సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క అని నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత లేవనెత్తిన అంశాలపై ఇప్పటికైనా సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొందరు మంత్రుల అవినీతి బాగోతాలు ఎందుకు బయటకు రావడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
టీకప్పులో తుఫాన్ కాదు.. పెద్ద బడబాగ్ని
కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్న గొడవ టీ కప్పులో తుఫాను కాదని, అది ఒక పెద్ద బడబాగ్ని అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ‘లూట్ అండ్ లెట్ లూట్’ అన్న విధానం నడుస్తున్నదని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు అభిలాష్ రంగినేని, మేడిపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.