ధర్మపురి, జనవరి 10 : నీళ్లు లేక గోదావరి నది ఎడారిని తలపిస్తున్నదని, ఈ సీజన్లో సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు రైతులు కలిశారు. ఈ సీజన్లో సాగునీరందక పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఎస్సారెస్పీ ద్వారా నీరందించేలా చూడాలని వేడుకున్నారు. వెంటనే ఆయన రైతులతో కలిసి దమ్మన్నపేట వద్ద ఎండిన గోదావరిని పరిశీలించారు. అనంతరం కొప్పుల మీడియాతో మాట్లాడుతూ యాసంగి సీజన్ ప్రారంభమై వరి నాట్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో గోదావరిలో నీరులేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో నిండుకుండలా ఉన్న గోదావరి ప్రస్తుతం నీరులేక ఎడారిని తలపిస్తున్నదని పేర్కొన్నారు.
కమ్మునూర్, మంగేళ, బోర్నపల్లి నుంచి ధర్మపురి వరకు గోదావరి ఆధారంగా 18 లిఫ్టులు నడుస్తున్నాయని తెలిపారు. రైతులు నాట్లు వేసుకున్నారని, నీటి తడుల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తదో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అప్పట్లో కేసీఆర్ గోదావరి నది, చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యామ్‌లను నిండుకుండల్లా ఉంచి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. యాసంగి సీజన్లో కూడా చెరువులు మత్తళ్లు దుంకాయని తెలిపారు. ఎప్పుడు అవసరం వచ్చినా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో మాట్లాడి ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయించానని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు.
మంత్రి ఉత్తమ్‌కు ఫోన్
గోదావరిని పరిశీలించిన తర్వాత కొప్పుల ఈశ్వర్.. మంత్రి ఉత్తమ్‌కు ఫోన్ చేసి సమస్యను వివరించారు. సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. వెంటనే ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. స్పందించిన మంత్రి త్వరలో కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
సాగునీరందించి రైతులను ఆదుకోండి
గోదావరి లిఫ్టు కింద పంట పొలాలు ఎండుతున్నయ్మంత్రి ఉత్తమ్‌కు ఫోన్ ద్వారా కొప్పుల ఈశ్వర్ వినతిరైతులతో కలిసి దమ్మన్నపేట వద్ద గోదావరి నది పరిశీలనగోదావరి ఎడారిని తలపిస్తున్నది. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం గోదావరిలోకి నీటిని విడుదల చేయాలి.
– కొప్పుల ఈశ్వర్