హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గురుకులాల దయనీయంగా మారాయని, సర్కారు నిర్లక్ష్యం వల్ల అడ్మిషన్లు ఖాళీ అవుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మెస్ బిల్లులు, సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బుధవారం ఆయన ఒక ప్రకటన ద్వారా మండిపడ్డారు. రాష్ట్రంలోని 600కి పైగా గురుకుల విద్యాలయాలకు అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు వాటికి తాళాలు వేశారని, ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ రాలేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
తెలంగాణ గురుకులాలు కేసీఆర్ సర్కారు హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిస్తే, కాంగ్రెస్ హయాంలో మాత్రం మూతపడే పరిస్థితికి వచ్చాయని ఇది సర్కారు నిర్లక్ష్యమేనని తూర్పారపట్టారు. కేసీఆర్ పాలనలో మెరుగైన విద్యాబోధన, నాణ్యమైన భోజనం అందిస్తే, రేవంత్పాలనలో పురుగుల అన్నం వడ్డిస్తు న్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ సమీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థుల పట్ల వైఖరి ఏమిటో స్పష్టమవుతున్నదని ఆగ్రహించారు.