హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫారం వర్కర్లతోపాటు జర్నలిస్టుల ప్రమాద బీమా సౌకర్యం ప్రభావితమైందని పేర్కొన్నారు. వారి ప్రమాద బీమా డబ్బులు చెల్లించడంలో సర్కారు చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.51 లక్షల మంది ఈ సౌకర్యం కోల్పోయే దుస్థితి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రాజకీయ చేయడం తప్ప.. మరో ఉద్దేశం లేదని విమర్శించారు. ప్రమాద బీమా కోసం 1,090 మంది ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.