హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దివ్యాంగుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, అలాంటి తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బీఆర్ఎస్ హయంలో వికలాంగుల సంక్షేమం శాఖలో భారీ అవినీతి జరిగిందని శాఖతో సంబంధం లేని హరీశ్‌రావుపై, తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దివ్వాంగుల సంక్షేమానికి నాటి కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.500గా ఉన్న సామాజిక పింఛన్‌ను ప్రత్యేక రాష్ట్రంలో తొలుత రూ.1500, తర్వాత రూ.3,016, మూడోసారి 4,000కు పెంచామని గుర్తుచేశారు. విద్యలో ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ప్రీ మెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు అందించామని పేర్కొన్నారు.
అంధ బాలికల కోసం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆశ్రమ పాఠశాలలు నిర్వహించామని, బుద్ధిమాంధ్యం గల విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రత్యేక పాఠశాలల్లో విద్య, ఏటా రూ.1,000 చొప్పున అందించామని తెలిపారు. స్వయం ఉపాధి కోసం 50 శాతం సబ్సిడీ రుణాలు, వాహనానికి రూ.30 వేల సబ్సిడీ, ఉచితంగా ల్యాప్‌టాప్, ఉపకరణాలు, దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించామని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 25 శాతం సబ్సిడీతో ఉపకరణాలు అందిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వికలాంగుల సంక్షేమ శాఖ బడ్జెట్ రూ.20 కోట్ల నుంచి రూ.83 కోట్లకు పెంచామని తెలిపారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి కార్పొరేషన్ చైర్మన్లు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతనైతే దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి పథకాలు అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు.