హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ తన పదవిని, ఆస్తులను కాపాడుకొనేందుకే ప్రధాని మోదీకి భజన చేస్తున్నాడని..ఢిల్లీకి పోయివచ్చిన తర్వాత ట్రెండ్ మార్చాడని.. కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్రనాయకులపై అదేపనిగా విమర్శలు గుప్పిస్తూ బీజేపీలో ఏటీం, బీటీం ఉన్నాయని చెప్పకనే చెప్తున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఈ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అర్థమైతుందో? లేదో?నని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో రాష్ట్రం అన్నింటా అథోగతి పాలైందని, పాలన రివర్స్‌గేర్‌లో పోతున్నదని దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమా దం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని వి మర్శించారు. ఘటన జరిగి పదిరోజులైనా ప్ర భుత్వం వాస్తవాలను వెల్లడించకుండా ఎందు కు దాచిపెడుతున్నదని ప్రశ్నించారు. సీఎం పదిరోజుల తర్వాత ఘటనాస్థలానికి వెళ్లి చిల్లర మాటలు మాట్లాడాన్ని చూస్తే అసహ్య మేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కసు వెళ్లగక్కడం ఎందుకని నిలదీశారు. ఆయన దుబాయ్ వెళ్లడాన్ని తప్పుపడుతున్న రేవంత్‌రెడ్డి..అదే కార్యక్రమానికి మంత్రులు కూడా హాజరైన విషయాన్ని మరిచిపోవడం విడ్డూరమన్నారు. పదిరోజులైనా ఈ ప్రమాదానికి పరిష్కారం చూపకుండా బూతులు వల్లించడం రేవంత్‌కే చెల్లిందని దెప్పిపొడిచారు.
శ్రీశైలం ఘటనపై పచ్చి అబద్ధాలు
ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలికి వెళ్లిన రేవంత్‌రెడ్డి కార్మికులను కాపాడే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా బీఆర్ఎస్పై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే అప్పటి ప్రభుత్వం వే గంగా స్పందించిందని చెప్పారు. తాను విద్యు త్తు అధికారులతో కలిసి కొన్ని గంటల్లోనే వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ‘24 గంటల్లోనే డెడ్‌బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించినం. రూ. కోటి చొప్పున పరిహారం ఇచ్చి నం. బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యో గం కల్పించినం.. ఇది మా కమిట్మెంట్కు నిదర్శనం’ అని చెప్పారు. రెండు మూడు నెలల్లోనే ప్రాజెక్టును పునరుద్ధరించామని గుర్తుచేశారు. ఇదేమీ తెలియకుండా ముఖ్యమంత్రి అడ్డదిడ్డంగా మాట్లాడి అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవాచేశారు. ప్రాణాలకు తెగించి ప్రాజెక్టును రక్షించిన విద్యుత్తు అధికారులు, సిబ్బందిని అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు.
24 గంటల కరెంటిస్తే రాజీనామా
కాంగ్రెస్ పాలనలో వేసవిరాకముందే నీళ్లు, కరెంట్ కష్టాలు మొదలయ్యాయని జగదీశ్‌రెడ్డి వాపోయారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం రికార్డుస్థాయిలో కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. సాగు, గృహాలకు 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు రుజువుచేస్తే తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. నాణ్యతలేని కరెంట్‌తో మోటర్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాళేశ్వరం నీటిని వినియోగించుకొనే అవకాశమున్నా పట్టించుకోవడం లేదని, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే నెపంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలపై దృష్టిపెట్టాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, భిక్షమయ్యగౌడ్, నాయకులు రమావత్ రవీందర్‌కుమార్, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.రేవంత్‌కు పాలనపై పట్టులేదు.. ప్రజలంటే కమిట్మెంట్ లేదు.. మంత్రులకు శాఖలపై అవగాహన లేదు. కనీసం 15 రోజులకోసారైనా సమీక్ష చేయడం లేదు..సమస్యలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి తన అనుకూల మీడియాలో ప్రచారం కోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నడు.
-జగదీశ్‌రెడ్డి
పది రోజుల తర్వాత ఘటనాస్థలానికి వెళ్లి ముఖ్యమంత్రి చిల్లర మాటలు మాట్లాడడం చూస్తే అసహ్యమేస్తున్నది. పదిరోజులైనా ఈ ప్రమాదానికి పరిష్కారం చూపకుండా బూతులు వల్లించడం రేవంత్‌కే చెల్లింది. –
జగదీశ్‌రెడ్డి