హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రుణమాఫీ కాలేదని నిరసన తెలిపిన రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పోలీసు యాక్ట్ పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హకులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రుణమాఫీకి పరిషారం చూపకుండా, పోలీసులను పురమాయించడం, అణగదొకే ప్రయత్నం చేయటం దుర్మార్గమని అన్నారు. ఆగస్టు 15లోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో అట్టర్‌ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. నమ్మి ఓటేసిన రైతన్నను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతన్నలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రైతు రాజ్యం కాదిది ..పోలీసు రాజ్యం అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. రూ.15000 కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసి రూ. 2 లక్షల వరకు రుణాలు తీర్చేశాం అని చెప్పుకోవటం సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రుణాలన్నీ మాఫీ చేస్తే రాష్ట్రంలో రైతులు రోడ్డెందుకు ఎకుతున్నారని ప్రశ్నించారు. సీఎం, మంత్రుల చేసిన అబద్దపు ప్రకటనలే రైతుల ఆందోళనకు కారణమని చెప్పారు. రానున్న రోజుల్లో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి పాడె కడ్తారని చెప్పారు. రైతులకు క్షమాపణలు చెప్పి, కేసులను వెనకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కరీంనగర్ విద్యానగర్/ ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 19: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని స్పష్టంచేశారు. సోమవారం కరీంనగర్‌తోపాటు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. 40వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి సోనియాగాంధీనే మోసం చేసిన ఘనులు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు.