హైదరాబాద్ / నిజామాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పష్టంచేశారు. ఈ విషయంలో రాష్ట ప్రజలకు స్పష్టత వచ్చిందని, కార్యకర్తలంతా ఓపికతో పనిచేస్తే మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని తేల్చిచెప్పారు. బీజేపీ పని కూడా తేలిపోయిందని, దేశం కోసం ధర్మం కోసం అని డైలాగ్ కొట్టడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్ వాస్తవానికి బక్వాస్ బాత్ హై’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. నార్త్ ఇండియా, మార్వాడీ, బీజేపీ కార్యకర్తలకు తప్ప పేదలు, రైతులు, దళితులకు బీజేపీ వాళ్లు ఏం చేయరని ప్రశ్నించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్, హన్మంత్ షిండేతో కలిసి పర్యటించారు. నాగిరెడ్డిపేట మండలంలో వరదలకు కొట్టుకు పోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతుల దీనగాథలు విని చలించి పోయారు. కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి తక్షణం సాయం చేస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడని మండిపడ్డారు. ‘యూరియా ఇవ్వలేక, రెండు పంటలకు రైతుబంధు లేక, సన్న వడ్లకు బోనస్ రాక రైతులు బాధ పడుతుంటే వరద బాధితులను ఆదుకోని నువ్వేం ముఖ్యమంత్రివి’ అంటూ దెప్పిపొడిచారు.
వడ్లకు మద్దతు ధరలో అన్యాయం..
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన్నాడు గోధుమలకు కనీస మద్దతు ధర రూ.1400, వడ్లకు రూ.1400 చొప్పున ఉన్నదని హరీశ్ గుర్తుచేశారు. ఈ రోజు నాటికి దేశంలో గోధుమలకు రూ.2,585, వడ్లకు రూ.2,369 కనీస మద్దతు ధర ఉందని, అంటే వడ్ల కంటే గోధుములకు రూ.200 ఎక్కువ ధర ఇస్తున్నారని వివరించారు. నాడు రెండింటికీ సమాన మద్దతు ధర ఉంటే ఇప్పుడెందుకు తేడా కనిపిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ దక్షిణ భారతదేశంలో వడ్లు పండించే రైతుల పొట్ట కొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.216 తేడా మూలంగా ఎకరాకు తెలంగాణ రైతు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు నష్ట పోవాల్సి వస్తున్నదని వివరించారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఇదేనా?.. ఇది బక్వాస్ కాదా? మన వడ్లకు కూడా గోధుమలకు సమానంగా మద్దతు ధర ఇవ్వాలి కదా?’ అంటూ నిలదీశారు. ‘కేంద్ర బడ్జెట్లో ఏపీకి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిండ్రు. అమరావతికి ప్యాకేజీ ఇచ్చిండ్రు. తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? దేశం కోసమంటే అందులో తెలంగాణ లేదా? మాకు అన్నింట్లో గుండు సున్నానేనా?..’ అని నిప్పులు చెరిగారు. పెట్టుబడులు, పరిశ్రమలు, రైల్వే పనులు, హైవే పనుల నిధులను బీజేపీ వాళ్లే ఆపుతున్నారని వివరించారు. ‘రీజినల్ రింగ్ రోడ్డు గాల్లోనే ఉన్నది. రేవంత్ రెడ్డి అడగడు. మోదీ ఇవ్వడు’ అంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో కీలక పాత్ర పోషించాలంటే బీఆర్ఎస్ ఎంపీల పాత్రను ప్రజలు గమనించాలని సూచించారు.
ఎలక్షన్లప్పుడు రజనీకాంత్.. అయ్యాక గజినీకాంత్..
మధ్యం, విత్తనాల ధరలు, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి రేవంత్‌రెడ్డి పేదల పొట్ట కొడుతున్నాడని హరీశ్ విమర్శించారు. బస్సుల్లో ఆడోళ్లకు ఫ్రీ అని మొగోళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నారని దుయ్యబట్టారు. ఎడాపెడా ధరలు పెంచుడు.. పేదలకు అందాల్సిన పథకాలను రద్దు చేసుడు తప్ప రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మీ ఎమ్మెల్యే (ఎల్లారెడ్డి) ప్యాకేజీ తెస్తా అన్నడు. ఇప్పుడు సప్పుడు చేస్తలేడు. ప్యాకేజీ ఇస్తా అన్నోడు (సీఎం) పత్తాలేడు’ అంటూ ఎద్దేవాచేశారు. సీఎం పరిశీలించిన బ్రిడ్జికి కూడా రిపేర్లు చేస్తలేరని మండిపడ్డారు.‘మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి నేడు ప్రతి మహిళకు 22 నెలల్లో రూ.55 వేలు బాకీ పడ్డడు. వృద్ధులు, వితంతువులకు ఒక్కొక్కరికి రూ.44 వేలు బాకీ పడ్డడు. రేవంత్‌రెడ్డి ఎలక్షన్లప్పుడు రజనీకాంత్.. అయిపోయినంక గజినీకాంత్’ అంటూ దెప్పిపొడిచారు. జడ్పీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టంచేశారు.
అధికారులు, పోలీసులు తస్మాత్ జాగ్రత్త
కేసీఆర్ హయాంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పెడితే వాటికి కాగితాలిచ్చి తానే జాబులిచ్చినట్టు రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నాడని హరీశ్ ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడని, కేసీఆర్ అమలు చేసిన పథకాలకు కటింగ్ పెట్టుడే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని, కటింగ్ మాస్టర్ అని దెప్పిపొడిచారు. ‘ఎవరెవరు బీఆర్ఎస్ కార్యకర్తలను తిప్పలు పెడుతున్నారో జాగ్రత్త.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’ అంటూ హెచ్చరించారు.
బీజేపీ నేతలకు దేశం లేదు.. ధర్మం లేదు : వేముల
‘ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండల లీడర్లు కొంత మంది బీజేపీలోకి పోయిండ్రు. ఎందుకు పోయినవ్ అని ఒకరిని అడిగిన. దేశం కోసం వెళ్తున్నా అని చెప్పిండు. బీఆర్ఎస్లోకి వచ్చినంక మళ్లీ ఏమైంది అని అడిగిన. అక్కడ దేశం కోసం అనుకున్నా.. అక్కడంతా వట్టిదే. దేశం లేదు.. ధర్మం లేదు. కేసీఆర్ లెక్క ఎవ్వరూ ఉండరని తిరిగి బీఆర్ఎస్కు వచ్చిన అని చెప్పిండు’ అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తనకు ఎదురైన అనుభవాన్ని బీఆర్ఎస్ గాంధారి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వివరించారు. 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంతో కొట్లాడి 8 యూరియా సంచులు కూడా తేలేకపోయారని మండిపడ్డారు.
బీజేపీ మీద భ్రమలు తొలగిపోతున్నాయని, తెలంగాణకు బీజేపీతో ఒరిగిందేమీ లేదని స్పష్టంచేశారు. జీఎస్టీ పేరిట 7 లక్షల కోట్లు, ఆదాయ పన్ను పేరిట 3 లక్షల కోట్లు మొత్తం రాష్ట్రం నుంచి 10 లక్షల కోట్లు కడుతుంటే తిరిగి తెలంగాణకు కేంద్రం ఇస్తున్నది 4 లక్షల కోట్లేనని వివరించారు. మన 6 లక్షల కోట్లు తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్లో పెడుతున్నారని మండిపడ్డారు. మన డబ్బును దోచి మోదీ తనకు ఇష్టమైన రాష్ర్టాల్లో పెడుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందు కు నోరు మూసుకున్నారని నిలదీశారు. ‘బతుకమ్మకు రెండు చీరల్వివ్వ చాతనైతలేదు కానీ లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట. అమెరికాలాగా చేస్తాడట’ అంటూ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘మూసీ సుందరీకరణతో కమీషన్ దొబ్బుకోవచ్చని రేవంత్‌రెడ్డి ఆలోచన’ అంటూ విమర్శించారు. కార్యక్రమంలో మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, సురేందర్, జనార్ధన్ గౌడ్, జడ్పీ మాజీ ఛైర్మన్ దఫేదార్ రాజు, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ర్టానికి, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే శ్రీరామరక్ష అని హరీశ్ స్పష్టంచేశారు. కేసీఆర్ తెలంగాణనే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా వారు ఊరుకోలేదని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నాడని విమర్శించారు. ‘యూరియా కోసం ఏనాడైనా ఇంత తిప్పలు పడ్డా మా?.. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? లేదా?’ అంటూ నిలదీశారు. తెలంగాణ రైతులంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక పార్టీది మోస చరిత్ర.. మరో పార్టీది ద్రోహ చరిత్ర.. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలే..చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరూ ఒకటే’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని న్యాలల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్‌లో హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నదని చెప్పారు. ఉమ్మడి మెదక్‌లోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టంచేశారు.
ఉత్తర భారతదేశం వారి కోసమే బీజేపీ పనిచేస్తున్నది. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకొనే బీజేపీకి తెలంగాణ అందులో భాగమని తెలియదా? తెలంగాణకు ఎందుకు నిధులివ్వరు? గోదావరి తెలంగాణలో బారాణా శాతం ప్రవహిస్తుంటే గోదావరి పుష్కరాలకు కేంద్రం పైసా నిధులిస్తలేదు. ఏపీలో టీడీపీ గల్లా పట్టి రూ.100 కోట్ల నిధులు తెచ్చుకుంటే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరు? కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మెదపరు? -హరీశ్‌రావు
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన్నాడు గోధుమలకు, వడ్లకు సమానంగా మద్దతు ధర రూ.1400 చొప్పున ఉన్నది. ఇప్పుడు గోధుమలకు రూ.2,585, వడ్లకు రూ.2,369 ధర ఉన్నది. వడ్ల కంటే గోధుములకు రూ.200 ఎక్కువ చెల్లిస్తున్నరు. నాడు రెండిండికీ సమాన ధర ఉంటే ఇప్పుడెందుకు తేడా కనిపిస్తున్నది? బీజేపీ దక్షిణ భారతదేశంలో వడ్లు పండించే రైతుల పొట్ట కొడుతున్నది. ఎకరాకు తెలంగాణ రైతు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు నష్ట పోవాల్సి వస్తున్నది. -హరీశ్‌రావు