వరంగల్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన 10% రిజర్వేషన్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మేల్కొని కొట్లాడకపోతే రిజర్వేషన్లు పోతాయని హెచ్చరించారు. ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని, ఇప్పటికైనా గిరిజన మేధావులు మేల్కొనాలని పిలుపునిచ్చారు.
వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మద్దతుగా గురువారం నిర్వహించిన భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు..
ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ పథకాలకు కోతలు, పేదలకు చార్జీల వాతలు అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.
మార్పు అంటే ఉన్న పథకాలను తీసేసుడేనా? అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ చెప్పిన మార్పు ఎలా ఉన్నదో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అంతా బాగుండాలంటే మంచి మార్పు రావాలి. ఇది విద్యావంతులతోనే మొదలుకావాలి’ అని పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం తామే ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నదని ఎద్దేవా చేశారు.
ఉద్యోగ పరీక్షలకు అప్లికేషన్ ఫీజు లేకుండా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ .. ఇప్పుడు టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు పెంచిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై లాఠీచార్జి చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద టీచర్స్ యూనియన్‌గా చెప్పుకునే పీఆర్టీయూ దీనిపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతుందని భరోసా ఇచ్చారు.
ప్రశ్నించే గొంతు ఎవరో చూడాలి
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎవరు ప్రశ్నిస్తారో గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటు వేయాలని హరీశ్‌రావు కోరారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ మోసం చేస్తే, ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే తీన్మార్ మల్లన్న ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బ్లాక్ మెయిలర్ మల్లన్న కావాలా? విద్యావంతుడు రాకేశ్‌రెడ్డి కావాలా? విద్యావంతులు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ‘రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలానీ టాపర్. ప్రజలకు సేవ చేయాలని తపన ఉన్న వ్యక్తి. వరంగల్ బిడ్డ. ఇక్కడి వారు రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.
ప్రశ్నించే సత్తా ఉన్న రాకేశ్‌రెడ్డి.. నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఎం సంజయ్‌కుమార్, కల్వకుంట సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోతు శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎం సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.