హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు వరుసగా బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం, యంత్రాంగం ఏం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని శనివారం ఎక్స్ వేదికగా డిమాండ్‌చేశారు. ‘ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ల నరసయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజుల్లోనే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నరు. అందరికీ అన్నంపెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పార్టీ సున్నం పెడుతున్నది. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మకద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్టు రంకెలేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారూ.. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెప్తరు? రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. ‘ఆత్మహత్యలు పరిషారం కావు.. బతికుండి కొట్లాడుదాం. అధైర్యపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది’ అని రైతులకు హరీశ్ భరోసా ఇచ్చారు.
తప్పులు ఎత్తిచూపితే జర్నలిస్టులపై కేసులా?
ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని హరీశ్ ప్రశ్నించారు. ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ పైసలు జమ చేసుకోవడం అన్యాయమంటూ వార్త రాసిన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల విలేకరులు అత్తె సాగర్ (నవ తెలంగాణ), ఓడ్నాల సత్యనారాయణ (నమస్తే తెలంగాణ)పై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొకేయడమేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? అని నిలదీశారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడతారా? అని పశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వేచ్ఛకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యువతకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని హరీశ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఓటు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని విజ్ఞప్తిచేశారు. ‘జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓటు కేవలం హకు మాత్రమే కాదు. అది మన దేశానికి, సమాజానికి ఇచ్చే ఒక ప్రామాణిక వాగ్దారం. ప్రతి ఓటు ముఖ్యమే. ప్రతి స్వరం విలువైనదే. మార్పు తీసుకురండి. మీ ఓటు మీ భవిష్యత్తు’ అని పేర్కొన్నారు.