హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు నిర్మాణ వ్యయాలను పెం చడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తట్టెడు మట్టి తీయలేదుగాని నిర్మాణ వ్యయాన్ని కోట్లకు కోట్లు పెంచడం కాంగ్రెస్‌కే చెల్లిందని విమర్శించారు. ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కారు ఆడుతున్న మరో నాటకమని మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను రూ.80 కోట్ల -100 కోట్లతో నిర్మిస్తామని గత ఏడాది జూలై 24న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదిలాబాద్‌లో ప్రకటించారు.
కానీ, సీఎం రేవంత్‌రెడ్డి నిరుడు అక్టోబర్ 11న రూ.125 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటుచేసే ఈ సూళ్లకు ఈ నెల రెండోవారంలో రూ.135 కోట్ల-150 కోట్లతో టెం డర్లు సైతం ఖరారు చేశారు. ఈ నెల 27న 20 సూళ్ల నిర్మాణం కోసం రూ.4,000 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నం. 96 విడుదల చేశారు. అంటే ఒకో సూల్ అంచనాలను పని మొదలు కాకుండానే మూడు రెట్లు, అంటే రూ.200 కోట్లకు పెంచారు. జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు అంచనాలను పెంచడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా?’ అని హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో నిలదీశారు.
తడిసిన ధాన్యాన్ని కొనండి..
ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతన్నలు వడ్లకుప్ప మీదే రాలిపోతున్నారంటూ హరీశ్‌రావు ఓ కవిత రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కవితను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైతన్నకు క్షమాపణ చెప్పి, వెంటనే తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.