హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ‘పాలమూరులోనే కాదు రాష్ట్రంలో ఏ ఒక ఎకరానికీ నీళ్లు ఇవ్వని అర్భకుడివి నువ్వు. కేసీఆర్ మీద రంకెలేస్తావా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తవాగుడే తప్ప ఒక వాగు మీదైనా ఇటుక కూడా పెట్టని ముఖ్యమంత్రివి అంటూ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి పనికిమాలిన పద్నాలుగు నెలలపాలనపై తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా. చర్చ ఎక్కడ..? ఏ రోజు చేద్దామో చెప్పాలి’ అని అన్నారు. తాను రేవంత్‌రెడ్డి చెప్పిన చోటికే వస్తానని, అది కొడంగల్ నియోజకవర్గమైనా సరే.. రేవంత్ ఇంట్లో అయినా సరేనని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ, రైతుబంధు, మహాలక్ష్మి, పెన్షన్లు, నిరుద్యోగభృతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు ఇలా సకల అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. రేవంత్‌రెడ్డి కుసంసారి కనుకనే కేసీఆర్‌పై కక్షపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్న రేవంత్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అరుపు లు, పెడబొబ్బలతో రాష్ట్ర సాగు, తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవనే సంగతిని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని చెప్పారు. నిందలు వేయడం మాని నదీజలాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని హితవు పలికారు.
పాలమూరును ఎడారిగా మార్చింది టీడీపీ, కాంగ్రెస్సే
రేవంత్‌రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు చెప్పారని హరీశ్‌రావు ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోతుంటే ఆపడం చేతగాని రేవంత్ తమపై రంకెలేస్తున్నారని విమర్శించారు. పాలమూరును ఎడారిగా మార్చిన పాపం టీడీపీ, కాంగ్రెస్‌లదేనని దుయ్యబట్టారు. సొంతజిల్లాకు తీరని ద్రోహం చేసింది రేవంత్‌రెడ్డేనని, ఆయనది తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే చరిత్ర అని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ పెట్టి, అక్కడి ప్రజల బతుకుల్లో నిప్పులు పోసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్‌రెడ్డికి ఆ పాపాల్లో వాటా ఉందని అన్నారు. పోతిరెడ్డిపాడును పెంచుతామని అన్నందుకే తాము నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని చెప్పారు.
పోతిరెడ్డిపాడుకు హారతులిచ్చిన కాంగ్రెస్
రేవంత్‌రెడ్డి వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా? సీఎం వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా? అని హరీశ్‌రావు విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వారికి ఊడిగం చేసింది, పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ నేతలదే అన్న విషయం మరచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెతను గుర్తు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబుకు ఊడిగం చేసి, నేడు మోదీని బడేభాయ్ అని సంబోధించి ఊసరవెల్లే సిగ్గుపడేలా చేసిన చరిత్ర రేవంత్‌దని మండిపడ్డారు. ‘నీటి విలువ తెలియదు.. నోటి విలువ తెలియదు. తెలిసిందల్లా అవినీతి నోట్ల విలువ మాత్రమే’ అని విరుచుపడ్డారు. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడకూడదని, ముఖ్యమంత్రిననే విషయాన్ని మరచిపోవద్దని హితవు పలికారు.
బీఆర్ఎస్ గెలిస్తే నారాయణపేట, కొడంగల్ నీటి కష్టాలు ఎప్పడో తీరేవి…
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన దుర్మార్గం రేవంత్‌రెడ్డిదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదురొని 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులు చేయకుండా కావాలని తొక్కిపెట్టి ప్రజల ఉసురు పోసుకుంటున్నది రేవంత్‌రెడ్డేనని విమర్శించారు. కాంగ్రెస్‌ను ఎన్నుకున్న పాపానికి పాలమూరు ప్రజలకు నీటి కటకట మొదలైందని అన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆరే
కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలిచావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆరేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. పాలమూరులో బతుకులేక వలసెల్లిన లక్షలాది మందిని వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్‌దని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ అని, కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, ఆర్డీఎస్ కింద కాంగ్రెస్ దరిద్రపుగొట్టు పాలనలో ఎన్నడూ 30వేల నుంచి 35 వేల ఎకరాలకు మించి సాగయ్యేది కాదని, అదే తమ హయాంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిచేసి రాజోలిబండ పూర్తి ఆయకట్టుకు నీరు అందించామని ఉదహరించారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించిన ఘనత తమదని వివరించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాగానే మరో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, బీఆర్ఎస్ చేసిన కృషితోనే రాష్ట్రంలో అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన సస్యశ్యామల జిల్లాగా పాలమూరు మారిందని వివరించారు.