సిద్దిపేట, డిసెంబర్ 28 : గ్రీన్ చానల్ పెట్టి రాష్ట్రంలో విద్యార్థుల మెస్ బిల్లులు రూపాయి పెండింగ్ లేకుండా ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, కానీ.. నాలుగు నెలల నుంచి మెస్ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. జీతం ఆగొచ్చు కానీ.. విద్యార్థుల మెస్ బిల్లులు మాత్రం ఆగవు అని చెప్పిన సీఎం మాట ఏమైందని ప్రశ్నించారు. శనివారం సిద్దిపేటలోని నాసర్‌పురా అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్లో పవనసుత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెట్టర్లు, దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లతో మాట్లాడి ఎన్నిరోజుల నుంచి మెస్ బిల్లులు, కాస్మొటిక్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవాచేశారు. చలికాలంలో వేడినీళ్లు రాక, దుప్పట్లు లేక విద్యార్థులు హాస్టళ్లలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈసారి ప్రభుత్వం దుప్పట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే పరిపాలన మీద రేవంత్‌రెడ్డి పట్టు కోల్పోయినట్టు అనిపిస్తున్నదని చెప్పారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలు కూడా అమలు కాకపోవడం దారుణమని, ఇది శాసనసభ గౌరవాన్ని తగ్గించడమేనని తెలిపారు.
సీఎం మాటలను అధికారులు వింటలేరా?
‘ముఖ్యమంత్రి మాటలను అధికారులు వినడం లేదా?, లేక ఉత్త మాటలే చెప్పిన అని అధికారులకు సీఎం చెప్తున్నడా? సీఎం అంటే అధికారులకు భయం లేదా? విలువ లేదా? గౌరవం లేదా?’ అని హరీశ్ అనుమానాలు వ్యక్తంచేశారు. తక్షణమే మెస్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖలను ముఖ్యమంత్రి తన వద్ద పెట్టుకొని ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. విద్యా శాఖకు మంత్రి లేడని, విద్యాశాఖతో పాటు సాంఘిక, గిరిజన, మైనార్టీ ఇలా అన్ని శాఖలూ సీఎం దగ్గరే ఉన్నాయని, ఇప్పటికైనా శాఖల పనితీరుపై సమీక్ష చేయాలని సూచించారు. ఎస్ఎస్ఏ నిధుల ద్వారా నడిచే అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి పాఠశాలలకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని, ఢిల్లీ పైసలిచ్చినా గల్లీలో పైసలు విడుదల చేయడం లేదని విమర్శించారు. రూ.1300 పెంచిన మెస్ బిల్లులు ఇప్పటికీ అమలు కాలేదని, అర్బన్ రెసిడెన్షియల్లో 1050 మెస్ బిల్లు ఇస్తున్నారని, 1 నుంచి 7 తరగతి వరకు 1300, 8వ తరగతికి 1500 ఇవ్వాలని, కాస్మోటిక్ బిల్లులు ఇంకా రూ.100 ఇస్తున్నారని, దాన్ని రూ.150 చేయాలని రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎంనే సస్పెండ్ చేయాలి
1వ తేదీనే జీతాలని గొప్పలు చెప్పిన సీఎం, 10వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు వేయడం లేదని హరీశ్ తెలిపారు. సస్పెండ్ చేయాల్సి వస్తే సీఎం రేవంత్‌రెడ్డినే సస్పెండ్ చేయాలని ఫైర్ అయ్యారు. పవనసుత యూత్ సభ్యులు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హాస్టళ్లను దత్తత తీసుకొని పిల్లలకు సేవ చేయాలని కోరారు. నాయకులు, యువకులు ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకుని విద్యార్థులకు దుప్పట్లు, స్వెట్టర్లు, ప్లేట్లు, బట్టలను పంపిణీ చేయాలని, డిసెంబర్ 31 దావత్‌లకు డబ్బులు వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలోని హాస్టల్‌ను దత్తత తీసుకుని పిల్లలకు బట్టలు అందజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, గుండు భూపేశ్, పాల సాయిరాం, మాజీ కౌన్సిలర్ జడేజా, పవనసుత యూత్ సభ్యులు కాముని నగేశ్, దొరగొల్ల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, యాదగిరి, చంద్రం, నర్ర రవి, మండల రాజు, లింగం గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.