హైదరాబాద్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే(,Local bodies elections) లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Former minister Errabelli) అన్నారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు.
తాను కాంగ్రెస్లోకి వెళుతున్నట్లు ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతు భరోసాకు దిక్కులేదని, అందరికీ రుణమాఫీ జరగలేదన్నారు. ఆసరా పింఛన్లను పెంచడంలో విఫలమైందన్నారు. సీఎంతో సహా మంత్రులు స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజక వర్గంలో బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని ఎర్రబెల్లి సూచించారు.