నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 10: బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించలేమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం, పాలకుర్తి మండలం దర్దేపల్లి, కొడకండ్ల గ్రామాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఖిలావరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే నరేందర్, మహబూబాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, లింగాలఘనపురంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్షీరాభిషేకం చేయగా.. మక్తల్, మదనాపురంలో మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మార్పు అంటే ప్రజల తలరాతలు మార్చాలని సూచించారు.
రేవంత్.. నిన్ను చరిత్ర క్షమించదు: దేశపతి
తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్‌రెడ్డిని చరిత్ర క్షమించదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. సిద్దిపేటలోని అంబేదర్ చౌరస్తాలో చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా, అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, మధిరలో జడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ సునీల్‌రావు, గన్నేరువరం మండలంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రామడుగు మండలం తిరుమలాపూర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాయికల్‌లో జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత తెలంగాణతల్లి విగ్రహాలను పాలతో అభిషేకించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెంలో మాజీ విప్ సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, చౌటుప్పల్‌లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నందికొండలో మాజీ ఎమ్మెల్యే భగత్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, సూర్యాపేటలో మాజీ ఎంపీ లింగయ్య తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జెపల్లి తండాలో మాజీ ఎమ్మెల్యే సురేందర్, బిచ్కుందలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే, బాన్సువాడలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్షీరాభిషేకం చేశారు.
తెలంగాణను కించపర్చేలా పోస్టులు పోలీసులకు కార్తీక్‌రెడ్డి ఫిర్యాదు
తెలంగాణను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టులకు సంబంధించిన వివరాలను అందజేశారు. తెలంగాణ పేరు, చిహ్నాలను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు చేపట్టాలని కోరారు.