జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 17 : రాష్ట్రంలో పేద గిరిజన విద్యార్థి మృతిచెందినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పలుగుగడ్డ తండాకు చెందిన పీజీ వైద్య విద్యార్థి సురేశ్ మృతి విషయాన్ని తెలుసుకొన్న ఆయన తండాకు వెళ్లి మృదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి చదివి ఉస్మానియాలో పీజీ సీటు సాధించిన సురేశ్ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ పేద గిరిజన విద్యార్థి చనిపోతే మెడికల్ కాలేజీ సిబ్బంది, ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్య విద్యార్థి సురేశ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామావత్ అంజయ్యనాయక్ డిమాండ్ చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్లు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అంజయ్య నాయక్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ర్యాగింగ్, వేధింపులతో సురేశ్‌ను బలితీసుకోవడం విద్యా వ్యవస్థకే మాయని మచ్చ అని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సురేశ్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.